శ్రీకాకుళం : నవంబరు 27 : డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో 5వ రాష్ట్ర సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొ" కూన రాంజి తెలిపారు. విశ్వవిద్యాలయంలో జరుగుతున్న 5వ ఏ పి సైన్సు కాంగ్రెస్ పై బుధవారం మీడియా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. డా బి ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి సైన్స్ కాంగ్రెస్ సమావేశాల నిర్వహణ బాధ్యత దక్కడం గౌరవంగా భావిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు పెద్ద విశ్వవిద్యాలయాలు మాత్రమే నిర్వహించాయని చెప్పారు. 28వ తేదీన సైన్స్ కాంగ్రెస్ ను రాష్ట్ర గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ప్రారంభిస్తారని పేర్కొంటూ ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, రాష్ట్ర మంత్రులు కొడాలి శ్రీ వేంకటేశ్వర రావు, ఆదిమూలపు సురేష్, ధర్మాన క్రిష్ణ దాస్ హాజరుకానున్నారని చెప్పారు. 28 నుండి 30వ తేదీ వరకు మూడు రోజులు సైన్స్ కాంగ్రెస్ ను అంగరంగ వైభవంగా నిర్వహించుటకు శాయశక్తులా కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 18 విశ్వవిద్యాలయాలకుగాను 12 విశ్వవిద్యాలయాల ఉపకులపతులు హాజరుకానున్నారని, మిగిలిన విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్ లు హాజరు అవుతున్నారని చెప్పారు. మొదటి రోజున రాష్ట్ర గవర్నర్ కీలక ఉపన్యాసంతోపాటు కంప్యూటర్ మాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన సూపర్ కంప్యూటర్ సృష్టికర్త విజయ భాట్కర్ పాల్గొనే అవకాశం ఉందని అతని రాకకోసం ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు, అధ్యాపకులు, ప్రజలు, ఆసక్తి గలవారు అందరూ సదస్సుల్లో పాల్గొని విజ్ఞానాన్ని ఆస్వాదించవచ్చని చెప్పారు. పాల్గొన్నందుకు సర్టిఫికేట్ కావాలని అనుకునే విద్యాసంస్థలు, విద్యార్థులు రూ.2500 రిజిస్ట్రేషన్ ఫీజ్ చెల్లించాలని చెప్పారు. అయితే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన విద్యార్థులు రూ.250, విద్యాసంస్థలు రూ.500 ఫీజ్ గా చెల్లింపుతో ప్రోత్సహిస్తున్నామని అన్నారు. మొదటి రోజున 7 కీలక ప్రసంగాలు, 4 విశిష్ట ఉపన్యాసాలు, 38 ఉపన్యాసాలు వివిధ అంశాలపై ఉంటాయని చెప్పారు.100కు పైగా ప్రదర్శన శాలలు ఉంటాయని తెలిపారు. 253 పోస్టర్ల ప్రదర్శన, 167 ఓరల్ ప్రదర్శనలు వెరసి 400కు పైగా పరిశోధన పత్రాలు ప్రదర్శన ఉంటాయని చెప్పారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తదితర ఆన్ లైన్ దిగ్గజాలతో జిల్లాలో ప్రఖ్యాతి చెందిన బుడితి, ఖాదీ తదితర ఉత్పత్తులను ఎన్ఆర్డిసి సౌజన్యంతో అనుసంధానం చేయుటకు చర్యలు చేపట్టామని తెలిపారు. వాటి ఉత్పత్తులు తమంతట తాము ఇ -మార్కెటింగ్ కు ఆన్ లైన్ లో చేరుటకు రూ.2 నుండి రూ.3 కోట్ల వరకు రుసుము చెల్లించాలని అయితే సైన్స్ కాంగ్రెస్ లో భాగంగా విశ్వవిద్యాలయం అనుసంధాన కర్తగా వ్యవహరిస్తూ సహకరిస్తుందని చెప్పారు. బయట నుండి వస్తున్న 1500 మందితో సహా మొత్తం 2500 మంది అతిధులు, విద్యర్ధులు పాల్గొంటున్నారని పేర్కొన్నారు.
ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కె. రఘుబాబు, జి.తులసి రావు, పి.సుజాత, తదితరులు పాల్గొన్నారు.
5వ రాష్ట్ర సైన్సు కాంగ్రెసుకు ఏర్పాట్లు