ధాన్యం కొనుగోళులో అసౌకర్యాలకు మీ సచివాలయాల్లో పిర్యాధు చేయండి

శ్రీకాకుళం, డిశంబరు 7: ధాన్యం కొనుగోళులో అసౌకర్యాలు ఉంటే గ్రామ సచివాలయాల్లో పిర్యాధులు చేయాలని జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు కోరారు. ఈ మేరకు శని వారం ఒక ప్రకటన విడుదల చేస్తూ అసౌకర్యాలు ఉంటే గ్రామ సచివాలయం లేదా తహశీల్దారు కార్యాలయంలో పిర్యాధు చేయాలని సూచించారు. వీటి కోసం జిల్లా స్ధాయిలో పౌరసరఫరాల జిల్లా మేనేజర్ కార్యాలయంలో కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసామని చెప్పారు. కాల్ సెంటర్ లో 08942 226526 ఫోన్ నంబరును ఏర్పాటు చేసామని అన్నారు కాల్ సెంటర్ కు కూడా ఇబ్బందులు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో ఖరీఫ్ -2019 పంటకాలంలో రైతుల నుండి ధాన్యం సేకరణకు జిల్లా వ్యాప్తంగా 159 ధాన్యం కొనుగోళు కేంద్రాలను ఏర్పాటు చేసామని డా.శ్రీనివాసులు తెలిపారు. కొనుగోళు కేంద్రాలలో సాధారణ రకం ధాన్యాన్ని క్వింటాళుకు రూ.1815, గ్రేడ్ – ఏ రకం ధాన్యానికి క్వింటాళుకు రూ.1835 చెల్లించడం జరుగుతోందని చెప్పారు. ధాన్యంలో తేమ 17 శాతం కంటే తక్కువగా ఉండాలని ఆ మేరకు రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని సూచించారు. రైతులు ముందుగానే ధాన్యం కొనుగోళు కేంద్రానికి వెళ్ళి ధాన్యం నాణ్యతను పరీక్షించుకోవాలని కోరారు. నాణ్యత ప్రమాణాలు సరిచూసిన తరువాతనే ధాన్యం కొనుగోళు జరుగుతుందని ఆయన స్పష్టం చేసారు. కొనుగోళు కేంద్రంలో పొలానికి సంబంధించిన ధృవపత్రాలు, ఆధార్ కార్డు, బ్యాంకు పుస్తకం వివరాల ధృవీకరణ పత్రాలను తీసుకువచ్చి నమోదు చేయించుకోవాలని తెలిపారు.