శ్రీకాకుళం : డిశంబరు 9 : నవ శకం కార్యక్రమంలో భాగంగా నేతన్న నేస్తం లబ్దిదారుల జాబితా సిద్ధం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. నేతన్న నేస్తం కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమ వారం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. లబ్దిదారుల జాబితా పక్కాగా ఉండాలన్నారు. అర్హులందరూ జాబితాలో ఉండాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలకు అనుగుణంగా జాబితాలు ఉండాలని అన్నారు. మగ్గం కలిగిన చేనేతకారులకు సంవత్సరానికి రూ.24 వేలను ఆర్ధిక సహాయంగా ప్రభుత్వం అందిస్తుందని ఆయన చెప్పారు. చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు ఎం.పద్మ మాట్లాడుతూ నవంబరు 21 నుండి 30వ తేదీ వరకు అన్ని వార్డు, గ్రామ సచివాలయాల్లో సోషల్ ఆడిట్ కు చేనేతకారుల జాబితాలను ప్రదర్శించామన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా జాబితాలను సిద్ధం చేయడం జరిగిందని పేర్కొన్నారు. 10 నియోజకవర్గాలు, 4 పురపాలక సంఘాల పరిధిలో 1447 మంది అర్హులుగా గుర్తించడం జరిగిందని ఆమె వివరించారు. అర్హులకు ఆర్ధిక సహాయాన్ని చేనేతకారుల బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ -2 ఆర్.గున్నయ్య, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి హెచ్.కూర్మారావు, డిఆర్డీఏ పిడి ఏ.కళ్యాణ చక్రవర్తి, గృహ నిర్మాణ సంస్థ పిడి టి.వేణుగోపాల్, ఆప్కో మార్కెటింగు అధికారి బి.ఉమాశంకర్, లీడ్ బ్యాంకు మేనేజర్ జివిబిడి హరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సిద్ధమైన నేతన్న నేస్తం