శ్రీకాకుళం : డిశంబరు 5 : మహిళలు ఆత్మస్దయిర్యాన్ని అలవరచు కోవాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖామాత్యులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. గురువారం శ్రీ శివానీ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ప్రాంగణంలో నిర్వహించిన మహిళల ఆత్మ రక్షణ అవగాహన సదస్సు కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిధిగా విచ్చేసి పాల్గొన్నారు. మహిళలే సమాజాన్ని ప్రభావితం చేస్తారని, మహిళలు అబలలు కాదు సబలలుగా నిరూపించుకోవాలని అన్నారు . ఆడపిల్లలు బాగా చదవుకోవాలని, చైతన్య వంతులు కావాలని అన్నారు. మన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మహిళలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారన్నారు. మహిళలకు స్వేఛ్ఛ, సమానత్వాలను అందిస్తున్నారని తెలిపారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగిందన్నారువిద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఇటీవల జరిగిన హైదరాబాదు దుర్ఘటన పునరావృత్తం కారాదన్నారు. అమ్మాయిలు మంచి ప్రవర్తన కలిగి వుండాలని, ధైర్యాన్ని అలవరచుకోవాలని చెప్పారు. కుటుంబ సభ్యులు అమ్మాయిల పట్ల గౌరవభావాన్ని మగపిల్లలకు అలవరచాలన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, అయిదుగురు మహిళలకు మంత్రి పదవిని కల్పించారన్నారు. మహిళకు హౌమ్ మినిస్టర్ పదవిని అందించి మహిళల పట్ల గల గౌరవాన్ని నిరూపించారన్నారు. ఆడపిల్లలకు రక్షణగా ప్రభత్వం పని చేస్తున్నదన్నారు. జిల్లా యంత్రాంగం, విద్యాసంస్థలు మీకు వెన్నుదన్నుగా వుంటాయని తెలిపారు. తల్లితండ్రులు పిల్లలను బాధ్యతతో పెంచాలని, ఉపాధ్యాయులు విద్యార్ధులకు విద్యతో పాటు నైతిక ప్రవరత్తనను అలవరచి మంచి సమాజనిర్మాణానికి సహకరించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ, కుటుంబంలో అమ్మాయిలతో పాటు అబ్బాయిలకు కూడా నైతిక విలువలు, మంచి ప్రవర్తనను అలవరచాలన్నారు. పాఠశాలలలో మోరల్ సైన్స్ ను పాఠ్యాంశంగా బోధించాలన్నారు. అన్ని రంగాలలోను మహిళలు ముందంజలో వున్నారని, ఒలంపిక్స్ లో కేవలం ఒక మహిళ అయిన పి.వి.సింధు కారణంగానే దేశానికి గౌరవం దక్కిందని గుర్తు చేసారు. కుటుంబంలో మహిళలు ఎక్కువగా గృహహింసకు గురికాబడుతున్నారని, ముందుగా గృహం నుండే హింసను పారద్రోలాలని అన్నారు. సినీమాల ద్వారా యువత పెడమార్గాన పడుతున్నారన్నారు. ప్రతీ ఒక్కరు సమాజంలోని చెడును ఎదిరించడానికి ముందుకు రావాలన్నారు. జిల్లా పోలీసు సూపరెంటెండెట్ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి మాట్లాడుతూ, చట్టాన్ని అమలు చేసే దిశగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళలు ఆత్మరక్షణకు 100, 112,181నెంబర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలీసు నెంబరు 100 అని, 112 నెంబరును కేంద్రప్రభుత్వం నేషనల్ ఎమర్జన్సీ రెస్పాన్సబుల్ సిస్టం ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 181 నెంబరును మహిళా, శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇందులో వన్ స్టాప్ సెంటర్, పోలీస్, గృహ హింసలకు సంబంధించిన సేవలను అందిస్తారని తెలిపారు. శ్రీకాకుళం పోలీసు వాట్సాప్ నెంబరు 6309990933 నెంబరును కూడా అపాయకరమైన పరిస్థితులలో ఉపయోగించుకోవచ్చునని తెలిపారు. అమ్మాయిలు ఎటువంటి భయానికి లోను కావద్దని, నిరంతరం అమ్మాయిల రక్షణకు పనిచేసి, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి పోలీసు వ్య్వస్థ పనిచేస్తున్నదని తెలిపారు. ఆడపిల్లల రక్షణపై అవగాహన కలిగించే విధంగా ట్రిపుల్ ఐ.టి., శివానీ కళాశాల విద్యార్ధినులు చేసిన నృత్యాలు, లఘునాటికలు అలరించాయి. నిర్భయ వుమెన్ ఫోరం వారు ఆడపిల్లల సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి శివాని కళా శాల యాజమాన్యం జె. బాలభాస్కరరావు, దుర్గా శ్రీనివాస రావు, రాజు, వెంకటరావు, డా.బి.శ్రీరామ మూర్తి, డా.దానేటి శ్రీధర్, సురంగి మోహన రావు, గీతా శ్రీకాంత్, తదితరులు. పాల్గొన్నారు.
ఆడది ఆదిపరాశక్తి . ఆత్మ స్తైర్యాన్ని అలవరచు కోవాలి : మంత్రి దర్మాన